పోటా పోటీ ధర్నాలు.. సిరిసిల్లలో BJP Vs BRS బాహాబాహీ.. ఇరువర్గాల మధ్య తోపులాట, చెప్పులతో దాడి

పోటా పోటీ ధర్నాలు..  సిరిసిల్లలో BJP Vs BRS బాహాబాహీ.. ఇరువర్గాల మధ్య తోపులాట, చెప్పులతో దాడి
  • బండి సంజయ్ ​రాజీనామా చేయాలంటూ సిరిసిల్లలో బీఆర్ఎస్ ధర్నా 
  • బీఆర్ఎస్​ హయాంలో 29 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కేటీఆర్ బాధ్యత 
  • వహించాలంటూ బీజేపీ ఆందోళన
  • ఇరువర్గాల మధ్య తోపులాట, చెప్పులతో దాడి..  పోలీసుల లాఠీచార్జ్​

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలోని నేతన్న చౌక్ రణరంగంగా మారింది. బీఆర్ఎస్​, బీజేపీ నేతలు, కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత నెలకొన్నది. బండి భగీరథ్ అరెస్టు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్​ రాజీనామా చేయాలని.. లేదంటే ప్రధాని మోదీ అతన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ ​చేయాలని డిమాండ్​ చేస్తూ బీఆర్ఎస్​ నేతలు నేతన్న చౌక్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు.

 బీఆర్ఎస్ పాలనలో 29 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆర్ బాధ్యత వహించాలంటూ బీజేపీ కూడా నేతన్న చౌక్ వద్దనే ధర్నా చేస్తామని ప్రకటించింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకేసారి నేతన్న చౌక్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.

బండి సంజయ్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ఆ రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఒక దశలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి దిగారు. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కడంతో పాత బస్టాండ్ వద్ద ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 

అక్కడకు చేరుకున్న ఎస్పీ మహేశ్ బి. గీతే.. ధర్నా విరమించాలని ఇరు పార్టీల నేతలను కోరినా వారు వినలేదు. రెండు పార్టీలు పరస్పరం రెచ్చగొట్టేలా వ్యవహరించడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.  వారిని బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

76 మందిపై కేసులు 

ఈ ఘటనకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్‌కు చెందిన 76 మంది నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణితోపాటు 38 మందిపైనా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు రాజిరెడ్డితోపాటు మొత్తం 38 మందిపైనా పోలీసులు కేసు ఫైల్‌ చేశారు.  

సంజయ్‌ నైతిక బాధ్యతవహించాలి: తోట ఆగయ్య

మైనర్‌‌పై లైంగికదాడి చేసిన బండి భగీరథ్ పోక్స్ కేసులో అరెస్ట్ అయ్యారని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి సంజయ్​తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్​ చేశారు. ఆయన రాజీనామా చేయకుంటే మోదీనే సంజయ్‌ని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్​ చేయాలని అన్నారు.  

ఇదే డిమాండ్‌తో తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే బీజేపీ వాళ్లు తమపై దాడి చేశారని ఆరోపించారు. కాగా, బీఆర్ఎస్​ హయాంలో ఓ ఏజెన్సీ తప్పిదం వల్ల 29 మంది ఇంటర్ స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని, వారి మరణాలకు బాధ్యత వహించి కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రశ్నించారు. కవిత లిక్కర్ కేసులో అరెస్టయినప్పుడు,  తన బామ్మర్థి ఫాంహౌజ్‌లో డ్రగ్స్‌తో దొరికినప్పుడు ఎందుకు రిజైన్ చేయలేదని నిలదీశారు.